SWAMY NIRGUNA CHAITANYA-NATURAL- SELF-UNDERSTANDING.
  • Index
  • Gallery
  • About
  • Trust
  • Blog
  • Literature
  • స్వయం అవగాహన
  • Today
  • Contact
  • Index
  • Gallery
  • About
  • Trust
  • Blog
  • Literature
  • స్వయం అవగాహన
  • Today
  • Contact
Search

SWAMY NIRGUNA CHAITANYA


లిస్టు అఫ్ Books ఫర్ రీడింగ్

ఈ క్రింది Books చదవడానికి  వాటి  మీద క్లిక్ చేయండి. 
భారతీయులకు ఉపనిషత్తులే పరమ ప్రమాణం
ఏకాత్మ భావంతో స్వీయ దైవారాధనచేయడమే ఉపనిషత్తుల సందేశం
స్వాత్మ ప్రబోధం
ఉపనిషత్తులలో మోక్షం అంటే...
' స్వయం అవగాహన ' - Books చదవడానికి  ఈ క్రింద బట్టన్ క్లిక్ చేయండి. 
స్వయం అవగాహన

BOOK-1

భారతీయులకు ఉపనిషత్తులే పరమ ప్రమాణం

                           భారతీయులకు ఉపనిషత్తులే పరమ ప్రమాణం

మనం భారతీయులం. నాటి నుండి నేటి వరకు స్వానుభవం పొందిన మహర్షులు, యోగులు, భక్తులు ఇంకనూ ఎందరో మహాత్ములతో విలసిల్లిన జ్ఞాన,కర్మ, పుణ్య,ధర్మ క్షేత్రమే భరత ఖండమని లోక విదితమే. అయినప్పటికి ప్రస్తుతం ఆధ్యాత్మిక రంగంలో అనేక విపరీత ధోరణులు తద్వారా భక్తులలో సంకుచిత దృష్టి అనేక విధాల ప్రభలుతున్నదనడం లోకవిదితమే. ​
Picture
అందరికి పరమ ప్రమాణమగు “ఉపనిషత్తుల' కు తగినంత ప్రాముఖ్యత ఇవ్వక పోవడమే ఇన్ని అనార్థాలకు కారణం అవుతోంది .
ఉపనిషత్తులు వేదాలే . భారతీయ తత్త్వజ్ఞానానికి, ధార్మిక సిద్ధాంతాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు ఉపనిషద్విజ్ఞానమే ఆధారం. సమస్త జీవకోటిలో మానవజన్మ శ్రేష్టమైన దనడం లేకవిదితమే. మానవ సమాజం ఎలా నిర్మించు కోవాలి - వ్యక్తి జన్మించినది మొదలు మరణించే వరకు ఇహపర సుఖాలు పొందడానికి, శాశ్వతముక్తిని ఎలా పొందాలి, ఉపనిషత్తుల గురించి అవగాహన, వ్యక్తి వికాసం, సమాజం నుంచి విశ్వ సమాజం వరకు ఎలా ఏవిధంగ మసలాలి,సామాన్యుని మొదలు పండితుల వరకు ఎలా ప్రవర్తించాలి, వారివారి విధులేమిటి? రాజు నడత దగ్గరనుంచి బంటు నడతవరకు విధులను సమస్తాన్ని తెలియ జేసేవే వేదశాస్రాలు.

                           వేదాలు అనాది భగవంతుని నిశ్వాసములే వేదాలని ఆస్తికుల విశ్వాసం. కనుక వారు వేదం అపౌరషేయమని అంటారు. కొందరు మహాత్ములు వేదాలు మానవులే రచించారని విశ్వసించారు. ఎప్పడు వేదాలను రచించారో ఏకాలంలో ఎవరు రచించారో ఇంత వఱకు ఎవ్వరూ సరిగ్గా చెప్పలేక పోతున్నారు.వీటిల్లో వ్రాసినవారి గ్రంధకర్త పేరు లేదు. అత్యంత ప్రాచీనమైనవని అందరూ అంగీకరించారు. మానవసమాజం కలసిమెలసి సుఖశాంతులతో జీవించడానికే కాకుండా  శాశ్విత నిత్యానందాన్ని పొందడానికి కావలసిన అద్వైత భావంతో సాకారనిరాకారంగ ఏవిధంగ దైవారాధన చేయాలో తద్వారా ఈ ప్రపంచమంతా వసుధైక కుటుంబంగా అందరూ కలసిమెలసి సుఖశాంతులతో సహజంగా ఉండాలని ఎంతో ప్రేమగా ఉపనిషత్తులేభోధించాయి. శాసించాయి. వేదాలే ఘన విజ్ఞాన రాశి అయి నందున వేదాలు అపౌరుషేయ మైన, పౌరుషేయ మైన వేదాల ఔన్నత్యానికి ఎంతమాత్రం భంగంలేదు. భారతీయు లందరికి వేదాలే పరమ ప్రమాణం అనడం ఉచితమే. వేదాలు అభ్యసించే క్రమంలో సంహితలు బ్రాహ్మణాలు, అరణ్యకాలు అంతమున ఉపనిషత్తులు ఉండడం వలన వేదాంతాలని అంటారు. వేదాల సారం, తత్త్వం, లక్ష్యమైన నిత్యానందాన్ని పొందింప జేసెడి జ్ఞానం గురించి అంతమున ఉపనిషత్తులలో ఉండుట చేతనూ వీటని వేదాంతాలని అంటారు. ఉపనిషత్తులు వేదశిఖరాలని విజ్ఞుల అభిప్రాయం. గుడి, గుడి కన్నా గోపురం, గోపురం కన్నా శిఖరం ఎత్తుగ ఉన్నతంగ, ఎత్తుగ ఉన్న మాదిరిగ వేదాల సారం ముఖ్య ప్రయోజనం ఉపనిషత్తులే.

                                అందు వలన ఉపనిషత్తులనే వేద శిఖరా లంటారు. "ఉప-ని-షద్” అంటే “ ప్రక్కన కూర్చుండడం“ శిష్యున్ని ప్రక్కగా కూర్చూండ బెట్టుకొని బోధించినది' అని అర్థం. ఇంకో అర్థం : బ్రహ్మానికి చేరువగా తిసుకు పోయేది. ప్రతివారికి నిత్యానందంగా ఉండాలను కోవడం సహజమే. అట్టి నిత్యానందం అందరూ పొందాలనే ఉపనిషత్తుల ఉపదేశం, సందేశం, ఆశయంకూడా. ఈ సహజ నిత్యానందాన్ని అజ్ఞానంచేత పొందలేని వారికి జ్ఞానాన్ని బోధించేవే ఉపనిషత్తులు. అజ్ఞాన మనస్సులకు తగిన విధంగ స్వధర్మాచరణను భక్తి, కర్మ, యోగ, జ్ఞాన, విచారణాదులను అన్ని పద్దతులను విశాల హృదయంతో ప్రబోధించినవే ఉపనిషత్తులు. అసలు వేదోపనిషత్తులు ఎన్నో మనకు ఇలా ముక్తికోపనిషత్తు వివరించింది.


శ్రుతి || ఋుగ్వేదాది విభాగేన వేదాశ్చత్వార ఈరితా, తేషాం శాఖా హ్యనేకాస్స్యుస్తా సూపనిషదస్తథా | ఋగ్వేదస్యతు శాఖస్స్యురేక వింశతి
సంఖ్యకాః, నవాధక శతం శాఖా యజుపషో మారుతాత్మజ |సహస్ర సంఖ్యయా జాతా శ్శాఖా స్యామ్నః పరస్తప, అధర్వణస్య శ్శాఖాస్స్యుః
పంచాశద్భేదతో హరే ఏకైక స్సాస్తు శాఖాయా ఏకైకోపనిషణ్మతా||

తా|| వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని నాలుగు విధములు. ఆ వేదములకు అనేక శాఖలు
ఆ శాఖలయందు ఉపనిషత్తులు అనేకములు గలవు. వాయునందనా! ఋగ్వేదమునకు ఇరువది యొక్క శాఖలు , యజుర్వేదమునకు నూట తొమ్మిది శాఖలు, సామవేదమునకు వేయి శాఖలు, అధర్వణ వేదమునకు ఏబది శాఖలుగా తెలియుచున్నవి అని పరంతపా గ్రహింపుము. ఒకొక్క శాఖకు ఒకొక్క ఉపనిషత్తు యున్నట్లు తెలియుచున్నది. శ్రీరామచంద్రుని సమాధానం బట్టి చూడగా వేదములు 18శాఖలను కలిగి యుండుట చేత 1180 ఉపనిషత్తు లుండవలెనని తెలియుచున్నది. అయినా కాల గర్భంలో చాలా వరకు లుప్తమైపోగా ప్రస్తుతము 108 ఉపనిషత్తులు మాత్రమే అధికారికంగా ప్రాచుర్యం నొందినవని ముక్తికోపనిషత్తు వలన తెలియు చున్నది.


శ్రుతి I
ఇయం కైవల్య ముక్తిస్తు కేనోపాయేన సిద్ధ్యతి
తా||శ్రీరామ! ఈ కైవల్యముక్తి ఏ ఉపాయముతో సిద్ధించునని ఆంజనేయుడు ప్రశ్నించెను.

శ్రుతి I| మాండూక్య మేక మేవాలం ముముక్షూణాం విముక్తయే తథా2ప్య సిద్ధం చేత్ జ్ఞానం దశోపనిషదం పర, తధాపి ధృడతా నోచే
దిజాన్డస్యాం జనాసుత ద్వాత్రింశాఖ్యోపనిషదం సమభ్యస్య నివర్తయ విదేహ ముక్తా విచ్చా చేదప్ణోత్తర శతం పఠ.

తా|| హనుమా! ముముక్షులకు మోక్షప్రాప్తికి మాండూక్యోపనిషత్తు ఒక్కటియే చాలును. అప్పటికిని జ్ఞానసిద్ధి కలుగనిచో దశోపనిషత్తులను పఠింప వలెను. ఆంజనేయా! ఆ దశోపనిషత్తులను పఠించినను జ్ఞానము దృఢముగా కలుగనిచో,ముప్పది రెండు ఉపనిషత్తులను చక్కగా అభ్యసించి మఱలుము. నీకు విదేహ ముక్తి యందు అభీష్ట మున్నచో నూట యెనిమిది ఉపనిషత్తులను పఠింపుమని చెప్పడంలో ఒక విశేషం ఉన్నది. ఉత్త మాధికారికి కేవలం తన సహజ స్వానుభవంలో కలిగెడి జాగ్రద, స్వప్న, నిద్రలను గురు ముఖంగా విచారించిన వారికి సహజ స్వస్వరూపానందం మౌనంగ స్వతః సిద్ధ మౌతుంది. అది గ్రహించలేని వారికి ఈశ, కేన, కఠాది మొదటి పది ఉపనిషత్తులను శ్రద్ధగ గురు ముఖంగానే పఠించాలి. ఇలాచేస్తే తప్పక జ్ఞానం కలుగుతుంది. అలాకూడ దృఢపడనివారికి వరుసగా ముప్పది రెండు ఉపనిషత్తులును, అలా కూడ దృఢపడని వారికి మొత్తం 108 ఉపనిషత్తులను శ్రద్ధగా గురు సన్నిధానంలో ఉండి పరిస్తే కచ్చితంగ వాస్తవ జ్ఞానం బడి నిత్యానందం కలుగు తుంది. జీవన్ముక్తి, విదేహ ముక్తులు సిద్దిస్తాయని అభిప్రాయమని గ్రహించాలి.


శ్రుతి:
విదేహముక్త్యో రష్ణోత్తర శతోపనిషదః ప్రమాణమ్; కర్తృత్వాది దుఖనివృత్తి ద్వారా నిత్యానందా వాప్తిః ప్రయోజనం భవతి|
తా|| జీవన్ముక్తి , విదేహముక్తులకు 108 ఉపనిషత్తులే ప్రమాణం. కర్తృత్వాది దుఃఖాలు తొలగడం ద్వారా నిత్యానందం లభించడమే ప్రయోజనం. ఇయ్యది పురుష ప్రయత్నం వలనే సాధ్యమగు చున్నదని ముక్తికోపనిషత్తు ఘంటాపధంగ బోధించినది. శిశువుకు 'తల్లిపాల' వలె సాధకులకు ఉపనిషత్తులే పరమప్రమాణం.
" మాతృ దేవో భవ, పితృ దేవోభవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ " అని తైత్తిరీయోపనిషత్తు,
తల్లి, తండ్రి, గురువు, అతిథి - వీరిని దైవంగా భావించి, స్వకర్తవ్యాన్ని సత్కర్మాచరణనుచేయడమే సనాతన స్వధర్మమని తెలుసుకొని ఆచరించడానికి,
" కుర్వన్నే నేహ కర్మాణి జిజీవిషే చ్ఛతగ్ం సమాః ఏవం త్వయి నా న్యథేతో2స్తి న కర్మ లిప్యతే నరే|
ఈశావాస్యోపనిషత్తు శాస్త్ర సమ్మతము లయిన కర్మలను చేయుచు మాత్రమే మానవుడు వంద సంవత్సరాలు జీవించ వలెనని, కోరుకొన వలెనని తెలుసు కొని నిష్కామంగ ఆచరించడానికి,
“దవేది దధ సత్య మస్తి న చే దిహావే దీ నృహతీ వినష్టిః అని కేనోపనిషత్తు---

ఈ మానవజన్మ యందు పరమాత్మని గూర్చి తెలిసికొనినచో, అతనకిసత్యమైన బ్రహ్మానందము సిద్దించు చున్నదని తెలుసుకొని
బ్రహ్మానందాన్ని పొందడానికి,
జ్ఞాతం యేన నిజం రూపం కైవల్యం పరమం పదమ్, నిష్కలం నిర్మలం సాక్షాత్సచ్చిదానంద రూపకమ్ అని
యోగ తత్మ్వోపనిషత్తు. కైవల్యరూపమై, మహాోన్నత పదమై నిష్కలమై, నిర్మలమై సాక్షాత్తు సచ్చిదానంద రూపమై నట్టి నిజ ఆత్మ స్వరూపము నెఱుగుటయే జ్ఞానమని తెలుసుకొనడానికి,
" సబ్రహ్మ సశివస్సేంద్రః సోక్షరఃపరమస్హ్వరాట్| స ఏవ విష్ణుస్సప్రాణ । స్సలోకాగ్నిస్పచంద్రమా: " అని కైవల యోపనిషత్తు ఆ పరమాత్మయే భ్రహ్మదేవుడు .అతడే శివుడు, ఇంద్రుడు, నాశరహితుడు, ఉత్తముడు, స్వయం ప్రభువు,విష్ణువు, ప్రాణము, కాలము, అగ్ని, చంద్రుడు అయి ఉన్నాడనికైవల్యోపనిషత్తు ,
సాకారంగ శివకేశవాదులనేగాక. ఈ జగత్తును ప్రకృతిని కూడ పరమాత్మగ భేద భావం లేక పూజించాలని ధ్యానించాలని బోధించిందని తెలుసుకొని ఏకాత్మ భావనతోనే స్వీయ దైవారాధనలు చేయడానికి,
" నాద్వైతవాదం కర్వీత గురుణాసహకుత్రచిత్I అద్వైతం భావయే దృక్త్యా గురుర్దేవస్య చాత్మనః అని

యోగశిభోపనిషత్తు గురువుతోకూడ అద్వైతవాదము నెక్కడను చేయరాదు. భక్తితో గురునికి, దేవునికి, తనకు అద్వైతమును అభేదమును భావించ వలెనని తెలుసు కొని ఆచరించడానికి,


అతఏవ బ్రహ్మలోకస్థా అపి బ్రహ్మ ముఖా ద్వేదాంత శ్రవణాది కృత్వా తేన సహ కైవల్యం లభస్తే, అత సర్వేషాం కైవల్య ముక్తిః జ్ఞాన మార్గేణోక్తా
న కర్మ సాంఖ్య యోగో పాసనాదిభి రిత్యుపనిషత్ " అని ముక్తికోపనిషత్తు,

క్రమముక్తి నొందువారు కూడా బ్రహ్మలోకమున వసించి , బ్రహ్మముఖతః వెలువడే వేదాంత పీయూష ధారలను పానముచేసి ప్రళయకాలమున బ్రహ్మదేవునితో కలిసి ముక్తిని పొందు చున్నారు. అందుచేత జ్ఞానమార్గమే ముక్తికి ఏకైక మార్గం. కర్మ ద్వారా గాని, సాంఖ్యం వలన గాని, ఉపాసన వలన గాని ముక్తి లభ్యం కాదని ఉపనిషద్వచనమని అవగాహన చేసుకొనడానికి,


." న జన్మమృతూ్యా, న బంధమోక్షే సాధనసమాధీ, న ధ్యాత్ృ ధ్యేయౌ, నముముక్తు ముక్తె ఇత్యేత దేవ పారమార్ధథికం తత్త్వమ్ " అని శివజ్ఞానోపషత్తు.


యదార్ధ సత్యమునందు జీవన్మరణములు, బంధవిముక్తులు, సాధన సమాధులు, ధ్యానము, ధ్యానించు వాడు, ముక్తి, ముక్తి కోరువాడు, ముక్తి పొందువాడు అనునది ఉండదని అవగాన చేసుకొని ఆచరించడానికీ ఉపనిషత్తులే పరమప్రమాణంకదా; సామాన్యుడి దగ్గర నుండి పండితుని వరకు ఇహ పర సుఖాలు పొందడానికి, సాలోక, సామీప్యాది చతుర్విధ ముక్తులను పొందడానికి, శాశ్వత నిత్యానందానుభవానికి, సనాతన స్వధర్మ సత్కర్మాచరణ కలిగి సమాజంలో శాంతి భద్రతలు నెలకొనడానికి కావలసిన మంత్రాలు, కర్మలు, ఆధ్యాత్మిక సందేశాలు, అనేక సాధనా మార్గాలు సులభంగ అర్థమయ్యే విధంగ ఉండడమే వేదశిఖరాలనెడి ఈ “ఉపనిషత్తులు" అందరికి ప్రమాణం,ఆచరణీయం. కనుక మనకుఇప్పుడున్న ఈ 108 ఉపనిషత్తులనైనా శ్రద్ధతో ఆదరించిన మన వేదమాత అనుగ్రహం వలన విశ్వ సమాజంలో శాంతి, భద్రతలు నెలకొన గలవు. స్వానందానుభవంతో తరించ గలరని ఆశించుచూ….
                                                             
                                                           ఉపనిషత్తులను మరువక, విడువక సేవించి తరించండి .
                                                                                                                                                                                                 నిర్గుణ చైతన్య
Back to List of Books

BOOK-2

ఏకాత్మ భావంతో స్వీయ దైవారాధనచేయడమే ఉపనిషత్తుల సందేశం

                                         ఏకాత్మ భావంతో స్వీయ దైవారాధనచేయడమే ఉపనిషత్తుల సందేశం.

Picture
                                      

                    మన అందరికి దైవం ఉన్నదని ఎంతో విశ్వాసం ఉన్నది. ఇది వాస్తవ సత్యం కూడా. అయినప్పటికీ ' దైవం ' ఉన్నాడని విశ్వసించిన వారికే ఎన్నో సందేహాలు రావడం సహజమే కదా. వాటిల్లో ప్రధానమైనవి దేవుళ్లు ఎంత మంది? పరమాత్మ అంటే ఎవరు? మరియు దైవం సాకారమా? నిరాకారమా? ఈ దేవుళ్లలో ఎవరు గొప్పవారు? శాశ్విత మోక్షం ఎవరు ఇస్తారు? అసలు ముక్తి అంటే ఏమిటి? ఈ విధంగ ఆధ్యాత్మిక సంబంధమైన సందేహాలు ఆస్తికులందరికి, ముఖ్యంగ భక్తి మార్గాన్ని ఆశ్రయించిన వారికి కలగడం లోక సహజమే కదా! వీటి గురించి సమాధానాలు, ప్రతివాదాలు ప్రపంచ మంతటా విస్తరించి ఉన్నాయి. వీటికి ముగింపు లేకుండడం లోకవిదితమే కదా. అందుకనే  దైవం' గురించి అనేక అభిప్రాయాలతో ఉన్నారు. వారిలో కొందరికి అత్మే దైవమని విశ్వాసం. ఆత్మలు వేరు దైవం వేరని మరికొందరికి విశ్వాసం. మా మార్గంలో దేవుడు ఒక్కడే, మీ మార్గంలో దేవుళ్లు ఎందరో ఉన్నారు కదా; అసలు మీ మనస్సుకు నిలకడ ఎలా ఏర్పడుతుంది? కనుక మా మార్గమే సులభమైనది. కనుక మా పద్దతినే మీరు అనుసరించడం చాలా మంచిది. మా సిద్దాంతమును, మా గురువును నమ్మితే చాలు. ఇకనుంచి ఏవిధమైన మార్గాలుగాని ఇతర దేవుళ్లుగాని, ఆయా పూజ ధ్యానాదులు గాని, ఎంత మాత్రం ఆచరించ వలసిన అవసరం లేదని కూడ మరి కొందరు ప్రచారం చేయడం లోకవిదితమేకదా. మరికొందరు


" నేను ఒక దైవాన్ని ఒక నామాన్ని ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. నీవు వేరొక దైవాన్ని, నామాన్ని ప్రేమిస్తావు, ఆరాధిస్తావు. నేను నీవు పూజించే దైవాన్ని, నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నీవు నేను వూజించే దైవాన్ని అభిప్రాయాన్ని గౌరవించు. అంతేగాని నాదైవం నీదైవం ఒకటేనని ఇరువురును కలిపేయాలని ఏకతా వాక్యాలను వల్లె వేయకు. ఇది ఇరువురుకు ప్రమాదకరమే. ఇరువురం కలసి సమాజరూపంలో ఉన్న దైవాన్ని పూజిద్ధాం. సేవిద్దాం. సమాజ శ్రేయస్సుకై పరిశ్రమిద్దాం. ఇది అర్ధంకావడం తక్షణ కర్తవ్యం. ఇదే ఆధ్యాత్మిక సూత్రం కావాలి “
అంటూ ప్రచారం చేసే ధోరణి కూడా ఇటీవల వ్యాపించింది. ఈ
విధంగా స్వీయ ఆరాధనలను, వాటితోబాటు క్రమంగా వ్యక్తి ఆరాధనలు తద్వారా స్వార్ధచంతనలు పెరిగి మనకు, లోకానికి కూడా మేలుకన్నా కీడే కలిగింది కదా! గత చెరిత్రే సాక్షం. దీని వలన వర్గాల ఆధిక్యం క్రమంగా పెరిగి, ఒకరి నొకరు అణగ ద్రొక్కడమే గాకుండ స్వార్ధమనే ముసుగులో సనాతన స్వధర్మ, సత్కర్మాచరణ కూడ విపరీత భావనతో చేయడం వలన మానవ సమాజానికి ఎప్పటికైనా ప్రమాదం కదా.

ఒక విధంగా పరశీలించిన యెడల సమాజంలో శాంతి, సమైక్యతలకు విఘాతం కల్గడానికి ముఖ్య కారణం స్వార్ధ పూరిత వ్యక్తిగత స్వీయారాధనలని నిస్సంశయంగా చెప్పపచ్చును. ఇది ఎవ్వరికీ మేలు చేయదుకదా. దీనిని నివారించాలంటే మనం ఏమి చెయ్యాలి ? అందరికి పరమ ప్రమాణమగు శాస్త్రాన్ని ఆశ్రయించాలి? అట్టి శాస్త్రం ఏది? ఉపనిషత్తులు మాత్రమే. వాస్తవానికి ఏ మార్గ, ఏపద్దతిలో వారికైననూ మానవత్వం కలిగి విశ్వశాంతికి హేతువగు స్వధర్మ. సత్కర్మాచరణ కలిగి, తద్వారా శ్వాశ్వత శాంతి, నిత్యానందాన్ని స్వాత్మానందాన్ని పొందడమే ముఖ్య లక్ష్యం గదా; కాని నేడు ఆ పరిస్తితికి భిన్నంగ ఉండడం లోకవిదితమే. సచ్చిదానంద స్వాత్మయే అందరి నిజ సహజ స్వస్వరూప మనియే శ్రుతులు బోధించాయి.


1. శ్రుతి|| న దేవః స్వాత్మనః పరః  |
తా|| తన ఆత్మ కంటె గొప్ప దేవుడు లేడని యోగశిభోపనిషత్తు, 
ఇంకా ఎన్నో శ్రుతలు ఘోషించాయని మరువకండి. కనుకనే జ్ఞానులు సదా నిత్య, సత్య, పరిపూర్ణ, మౌన సాత్మానందులే యనుట లోకవిదితమే. అజ్ఞానంచేత ఆత్మానందం పొంద లేని వారికోసమే సాకార నిరాకారంగ వున్న “ఈశ్వరు"నే ధ్యానాదులు చేసి తరించాలని శ్రుతులు ఉపదేశించాయి.

2. శ్రుతి| ఏకోదేవః సర్వభూతేషుగూఢః కర్మాద్యక్షః సర్వభూతాధివాసః సాక్షీ చేతా కేవలో నిర్ణుణశ్చ ర్వవ్యాపీ సర్వభూతాన్తరాత్మా|
తా || నమస్త జీవులందును నిగూఢముగా నుండు వాడును సర్వవ్యాపియు, సర్వప్రాణులందును అంతరాత్మయై ఉండు వాడును సర్వాధ్యక్షుడును, సర్వభూతములందును అధివసించువాడును, సాక్షియు చైతన్య రూపుడును. కేవలుడును, నిర్గుణుడును అగు పరమాత్మ'ఒక్కడే దేవుడని,
బ్రహ్మోపనిషత్తు,  గోపాలతాపిన్యుపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు
ఏమాత్రం సంశయంలేకుండ మానవులందరికిబోధించాయి. ఈ స్వీయ దైవారాధనలు కూడ ఎవరి ఇష్టమైన పద్దతిలో వారు చేసుకోవచ్చునని చెప్పుతూనే ఏ విధంగా, ఏ భావనతో ఆరాధన చేసిన యెడల, తమకు తమతో బాటు అందరికి మేలు కలుగ గలదో అట్టి విధంగానే చేయుచు, సచ్చిదానంద స్వాత్మ బ్రహ్మమే తామని తెలుసుకొని నిత్యానందాన్ని పొందాలని ఉపనిషత్తుల సందేశం, ఈ స్వాత్మ చైతన్యమే అనేక విధాలుగ అభివ్యక్తమైనదని శ్రుతులే ఘోషించాయి.

3. శ్రుతి| ఏకో వశీ సర్వభూతాన్త రాత్మా, ఏకం రూపం బహుధా యః కరోతి, త మాత్మస్థం యే~ను పశ్వన్తి ధీరా స్తేషాం సుఖం శాశ్వతం
నేత రేషామ్
తా|| సమస్తమును తన వశమందుంచుకొని సమస్త ప్రాణులకును అంతరాత్మ అయియున్న ఆత్మ తన ఏకైక రూపమును అనేక
విధములుగ వ్యక్తపరచుచున్నది. తమ ఆత్మయందలి ఈ తత్త్వమును దర్శించు జ్ఞానులకు మాత్రమే శాశ్విత సుఖము కలుగుచున్నదని
కఠోపనిషత్తు, బ్రహ్మోపనిషత్తులు
ఈ జగజీవేశ్వరులుగా భాసించిన దంతయూ వాస్తవంగ సచ్చిదానంద స్వాత్మ బ్రహ్మమేనని స్పష్టంగ బోధించాయని మరువకండి. కనుక ఏవిధంగ చూసినా సాకార ప్రకృతి గ చేయు స్వీయ దైవారాధనలు స్వీయ ఆత్మ చైతన్యానికే ననెడి శ్రుతుల ప్రబోధాలను గ్రహించి ఆచరించ గలరు. 

4.శ్రుతి| ఈశ్వర పూజనం నామః ప్రసన్న న్వభావేన యథాశక్తి విష్ణురుద్రాది పూజనమ్|
తా|| నిర్మల స్వభావముతో శక్తికొలది విష్ణువు, శివుడు మొదలైన ఇష్టదేవతలను పూజించుటే ఈశ్వరపూజనము  అని శాండిల్యోపనిషత్తు 
ఎంత వివరంగ చెప్పిందో నిజభక్తులు గ్రహించాలి. ఇంకనూ శ్రుతులు

5.శ్రుతి| శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే | శివస్య హృదయం విష్ణోర్విష్టోశ్చ హృదయం శివః|
తా|| శివస్వరూపుడైన విష్ణువునకు, విష్ణుస్వరూపుడైన శివునకు నమస్కారము. శివుని హృదయం విష్ణువే. విష్ణువు యొక్క హృదయం
శివుడే, అని
స్కంధోపనిషత్తు
బోదించినది


6.శ్రుతి || యే ద్విషన్తి విరూపాక్షం తే ద్విషన్తి జనార్దనమ్, యే రుద్రం నాభిజానాన్తి తే న జానాన్తి కేశవమ్|
తా|| ఎవరు శివుని ద్వేషించు చున్నారో, వారు విష్ణువుని ద్వేషించు చున్నారు. ఎవరు రుద్రుని తెలుసుకొనుట లేదో వారుకేశవుడిని తెలిసికొనడం లేదని కూడ
రుద్రహృదయోపనిషత్తు
స్పష్టంగ బోధించింది.


శ్రుతు లింకనూ “పరమాత్మే” అన్ని స్వరూపాలని బోధించినది.


7.శ్రుతి I " స ఆదిత్యో విష్ణు శ్చేశ్వర శృ " -
తా || సూర్య భగవానుడు విష్ణువు, ఈశ్వరుడును, ఈ పరమాత్మయే నని
బ్రహ్మోపనిషత్
సాధకులు ఏకాత్మ దృష్టితోనే దైవారాధన చేయాలని ఉపదేశంచేసింది. సర్వం శివమయంగా, లేదా విష్ణుమయంగా లేదా ఎవరి ఇష్ట ప్రకారం
వారు ఏకాత్మ భావంతోనే చేయాలని శ్రుతుల ఉపదేశం.

8.శ్రుతి II యోహ వై రుద్ర స్పభగవాన్ యశ్చ బ్రహ్మ యశ్చ విష్ణుః యశ్చ మహేశ్వరః యాచోమా యశ్చ వినాయకః యశ్చ స్కందః
యశ్చేంద్రః యశ్చాగ్నిః.. యశ్చ విశ్వం యశ్చ సర్వం|
తా|| అట్టి భగవంతుడగు రుద్రుడే విష్ణువు, మహేశ్వరుడు, ఉమాదేవి వినాయకుడు, స్కందుడు, ఇంద్రుడు, విశ్వము, ఈ సర్వము అని
   అధర్వశిరో పనిషత్తు,
రుద్రుడగు శివుడే సర్వస్వరూపునిగా స్పష్టంచేసిందని తెలుసుకోండి.
   (  यो वै रुद्रः स भगवान्यश्च ब्रह्मा तस्मै वै नमोनमः )


9.శ్రుతి|| అధ నిత్యో నారాయణః, బ్రహ్మ నారాయణ:, శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః, ద్యావాపృథివ్యౌ చ నారాయణః I
తా|| నారాయణుడు నిత్యుడు. బ్రహ్మదేవుడు నారాయణుడే శివుడు నారాయణుడే ఇంద్రుడు నారాయణుడే భూమ్యాకాశాలు నారాయణుడే అని
నారాయణోపనిషత్తు
విష్ణువునే సర్వస్వరూపునిగా స్పష్టం చేసిందని గ్రహించాలి.


10.శ్రుతి ||నిత్య శ్శుద్దో నిరంజనో విభుర ద్వయ శివ ఏకః |
తా || నిత్యుడును, శుద్దుడును, నిరంజనుడును, విభువును, అద్వయానందుడును నగు శివుడొక్కడే నని
త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్తు
శివకేశవాదుల తత్త్వం సదా అద్వైతమేనని జ్ఞానభక్తులకు ఘంటాపధంగ స్పష్టం చేసినది.


11.శ్రుతి| " అద్వైత పరమానందో విభు ర్నిత్యో నిష్కళంకో నిర్వికీల్పో నిరంజనో నిరాఖ్యాత శుద్ధోదేవ ఏకో నారాయణ
తా || అద్వైత పరమానందుడు, విభువు, నిత్యుడు, నిష్కళంకుడు
నిర్వికల్పుడు, నిరంజనుడు, నిరాఖ్యాతుడును, శుద్దుడు, దేవుడు, ఏకుడైన నారాయణుడే నని
మహానారాయణోపనిషత్తు . ఇంకను

12.శ్రుతి |" స్వయం బ్రహ్మా స్వయం విష్ణుః స్వయంమింద్ర స్వయం శివ, స్వయం విశ్వం మిదం సర్వం స్వస్మాదన్య నృకించన
తా | బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు, శివుడు, విశ్వరూపములో నున్న ఉపాధియంతయు, సర్వమును ఆత్మయే. ఆత్మ కంటే వేరుగా నున్న
వస్తు వేదియు లేదని
ఆధ్మాత్మోపనిషత్తు
ఏకాత్మ తత్త్వాన్ని ఉపదేశించింది .
ముఖ్యంగ మనందరం సమైక్యతగ ఉంటేనే విశ్వసమాజం సుఖ సంపత్తులతో ఉంటుందనడం లోక విదితమే. ఏకాత్మభావన లేకుంటే కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కాగలదు. మన తల్లీ దండ్రులు వేరువేరుగా ఉన్ననూ, వారిద్దరిని ఒకే ఫొటోలో చూడాలని ఆశించుట చేతనే, వారిని ఒకే ఫొటోలో చూస్తున్నాం. కనీసం ఈ జ్ఞానం చిన్న పిల్లలకు సైతం తెలిసినట్లుగా, శివకేశవాదులను భేదభావంతో పూజించే వారి హృదయ ఫలకంలో ఆ దైవాలను ఎంతమంది బోధకులు నేడు సమానంగ ఆదరిస్తూన్నారో వారి అంతరాత్మకే ఎరుక. తల్లి, దండ్రులు వారి పిల్లలు ఎంత మంది ఉన్ననూ, సమాన ప్రేమతో ఆదరించడం సహజమే కదా, ఆవిధంగ పిల్లలు కూడ ప్రవర్తించడం శ్రేయస్కరమే కదా.
 ఈ విధానం వలన విశ్వ సమాజ కుటుంబం కూడ సుఖశాంతులతోఈ విలసిల్లును కదా; ఆ విధంగానే శివకేశవాదులు ఐక్యతగా లేకుండ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిపేవారా? భక్తులను ఉద్దరించడం జరిగేదా? మన ఇష్ట దైవం అన్ని ప్రాణుల యందునూ " అంతర్యామి “గా ఉన్నట్లుగ పూజిస్తాం కదా. దీని అర్ధాన్ని తెలిసిన భక్తు లెవరైనా భేదభావంగ అన్య దైవాలను ఎట్లు చూడగలరు? దైవమును విశ్వసించిన మన భారతీయ ఆధ్యాత్మిక కుటుంబంలో, ఏ ఒక్క దేవుడిని మాత్రమే ఏ యుగంలో నైనా అంగీకరించి, ధ్యానారాధనలు చేయడం జరిగినదా కాబట్టి జరుగని వాటి గురించి ఎంతోశ్రమతో ప్రచారాలు చేసినా తర్కంతో నానార్థాలను వ్యాకరణాది శాస్త్రాలతో నిరూపించి, భక్తులలో భక్తితోబాటు, క్రమంగ భేదభావాలు రగిలి ఎప్పటికైనా తమకు
విశ్వసమాజానికి కూడ ప్రమాద కరమే. గతచరిత్రే దీనికి సాక్ష్యం కనుక ఉపనిషత్తుల ప్రమాణ ప్రకారం ఏకాత్మ భావంతో స్వధర్మం
స్వీయారాధనలు చేసినచో నిష్కామ్యత, తద్వారా విశ్వమున శాంతియు, జ్ఞానభక్తిచే స్వస్వరూప నిత్యానందాన్ని తప్పక పొందగలం


                                                                                                                                                                                                                   నిర్గుణ చైతన్య


Back to List of Books

Book3

స్వాత్మ ప్రబోధం

స్వాత్మ ప్రబోధం 
swaatma prabodham

Book3


BOOK 4

ఉపనిషత్తులలో మోక్షం అంటే...

ఉపనిషత్తులలో మోక్షం అంటే...

Picture
                  ప్రతి వారు ముఖ్యంగ ఆధ్యాత్మిక మార్గంలోని వారందరూ 'మోక్షం' పొందాలని తపిస్తారు. సామాన్యంగా ఏదో ఒక సందర్భంలో ప్రతివారు నాకు 'మోక్షం' ఎప్పుడు వస్తుందో నాయనా, ఈ బాధలు పడలేక పోతున్నానని అనడం లోక విదితమే. ఇంతకీ మోక్షం - ముక్తి -అంటే ఏమిటి? ఈ విషయంలో ప్రతివారికి కొన్ని విశ్వాసాలున్నాయి. కొందరికి స్వర్గమే మోక్షం మరికొందరికి మోక్షం అంటే కైలాస వైకుంఠాదులే. కొందరి దృష్టిలో వారి ఇష్ట దైవమునందు ఐక్యం జెందడమే మోక్షం.  మరికొందరి దృష్టిలో యోగమార్గాల ద్వారా సమాధి -పొందడమే మోక్షం.  మరి కొందరికి మానవసేవ చేయడమే 'మోక్షం',  కోరికలను విడవడమే మోక్షమని కొందరి సిద్ధాంతం. ఇంకా అనేక విధాలుగా 'మోక్షం' గురించి బోధించడం, తర్కించడం, వాదించడంమే గాక వారి వారి అభిప్రాయాలకు తగినట్టుగ శాస్త్రాలను ఏకరువు బెట్టి నమ్మకాన్ని పెంచడమే గాక , మోక్షం ఇచ్చే దేవుళ్ళలో అనేకత్వం చూపించడం, వారి వారి వర్గాలను పెంచుకోవడానికే శాస్త్రాలను కూడ తర్కంతో వారికి అనుకూలంగ వ్యాకరణ ప్రకారంగ ఋజువు చేయడం లేదా నానార్థాలు కల్పించి వర్గాలను పెంచు కోవడం లోక విదితమే. దీని వలన వారికి, లోకానికి కూడ మేలు కన్నా కీడే జరిగిందని గతచరిత్రే సాక్ష్యం. వాస్తవంగ నిజ ఆర్తి జిజ్ఞాస కలిగిన వారెవరూ వాదతర్కాలు చేయరు కదా. వారు విశ్వాసంతో సాధనాదులు చేసి తరించారు కూడ.  వీరి వలన విశ్వ సమాజంలో శాంతి ప్రేమలు విలసిల్లాయి. ప్రస్తుత అంశమైన 'ముక్తి' గురించి మనకు పరమ ప్రమాణమైన శ్రుతులు ఏమి బోధించాయో, ఏమి ఉపదేశించాయో అందరికి అవగాహన కలగాలి. అప్పుడు మోక్షం గురించి తపించే ఆర్తి, జిజ్ఞాస గలిగిన సాధకు లందరికి వారి వారి మనోఅర్హత ననుసరించి తగిన విధంగా కృషచేసి ముక్తిని పొంద గలరు. అట్టివారి స్వధర్మ సత్కర్మాచరణ వలన విశ్వసమాజంలో శాంతి నెలకొనగలదు. అసలు మోక్షం అంటే ఏమిటోముక్తి అంటే ఏమిటో? శ్రుతుల అభిప్రాయం, ఉపదేశం కూడ తెలుసు కొందాము.
________________________________________________
​

శ్రుతి|| 'సర్వదుఃఖాత్యంస్త నివృత్తిః మోక్షః సదానంద ప్రాప్తిశ్చ|
ముక్తిరాత్మా బోధాత్, పరిణమితి.
తా|| సకల బాధలనుండియు విముక్తి నొంది ఉత్కృష్టానందాన్ని ,పొందడమే మోక్షం. ఆత్మజ్ఞానఫలమే ముక్తి. ---- బ్రహ్మరహస్యోపనిషత్తు.
ఇక్కడ మోక్ష మనగా అన్ని బాధలనుండి, అన్ని దు:ఖాలనుండి విడుదలై నిత్యానందం పొందడమే అని అర్థం. ఇక్కడ ఉత్కృష్టానందం అనగా గొప్పదియగు 'సుఖము' అని శ్రుతుల అభిప్రాయం. అది సచ్చిదానందమే. అందుకనే 108 ఉపనిషత్తుల ప్రయోజనం ఉపదేశసారం ఏమిటో ఈ మంత్రాన్ని పరిశీలించండి.
శ్రుతి|| " జీవన్ముక్తి , విదేహముక్త్తో రష్ణోత్తర శతోపనిషదః ప్రమాణమ్
కర్తృత్వాది దుఃఖనివృత్తి ద్వారా నిత్యానందా వాప్తిః ప్రయోజనం భవతి”.
తా || జీవన్ముక్తి, విదేహముక్తులకు 108 ఉపనిషత్తులే ప్రమాణం.

కర్తృత్వాది దుఃఖాలు తొలగడం ద్వారా నిత్యానందం లభించడమే ప్రయోజనం. ఇయ్యది పురుష ప్రయత్నంతోనే సాధ్యమగు చున్నదని ముక్తికోపనిషత్తు ఎంతో స్పష్టంగ 108 ఉపనిషత్తుల సారాన్ని మోక్షాసక్తి గలవారందరికి ప్రబోధించినదని మరువ రాదు. మరి మోక్షం' ఎన్నిరకాలు? 'మోక్షం' ఏ లోకంలో, ఎవరి వలన, ఏవిధంగ ఎక్కడ, ఎప్పుడు, ఎలా పొందగలము? నిజమైన మోక్షం ఏ ఉపాయంతో లభిస్తుంది? ఇటు వంటి ప్రశ్నలు జిజ్ఞాస సాధకులకు కలగడం సహజమే. సరిగ్గా ఇదే సందేహం ఆంజనేయస్వామికి కూడ కలుగగా
శ్రీరామచంద్రమూర్తిని ప్రశ్నించగా ఎంతో వివరంగా చెప్పడమే ముక్తికోపనిషత్తు యొక్క విశిష్టత.

శ్రుతి | కేచిన్ముని శ్రేష్టా ముక్తి రేకేతి చక్షిరే. కేచిత్త్వన్నామ భజనా
తాంకశ్యాం తారోపదేశతః, అన్యేతు సాంఖ్యయోగేన చాపరే అన్యే|
వేదాంత వాక్యార్ధ విచారా త్పరమర్షయః, సాలోక్యాది విభాగేన చతుర్ధా
ముక్తి రీరితా||
తా|| ఆంజనేయుడు:- రామభద్రా! మోక్షము ఒకేవిధమని కొందరు తెలుపుచున్నారు. కొందరు మీ నామమును కీర్తించుటచేత ముక్తి కలుగునని చెప్పచున్నారు. కొందరు కాశీనగరము నందు తారక మంత్రోపదేశము నొందుట చేత ముక్తి లభించునని పలుకుచున్నారు. మరికొందరు సాంఖ్యయోగముచేత ముక్తి లభించునని పలుకుచున్నారు. వేదాంతవాక్యార్థ విచారము చేత మోక్షము లభించునని మరికొందరు
మహర్షులు తెలుపుచున్నారు. (వీనిలో ఏదిశ్రేష్ఠమో తెలియగోరి హనుమంతుడు శ్రీరాముని ప్రశ్నించాడు.)
నిజ మోక్షాభి లాషులకు కలిగిన సందేహమే అంజనేయునికి కూడ కలిగి మోక్షమెన్ని విధాలో శాశ్వత కైవల్య ముక్తి అంటే ఏమిటో, అది ఏ ఉపాయంచేతపొందబడుతుందో అని స్పష్టంగ ప్రశ్నించిన తీరు ముముక్షుపులందరికి ఆదర్శనీయమే. కనుక పరమ ప్రమాణమైన సనాతన "ఉపనిషత్తుల"ను అందరికి వివరిస్తూనే, భగవద్గీతాది గ్రంధాలను బోధించిన యెడల ఆధ్యాత్మిక పరిస్థితి ఎంత ఉన్నతంగ ఉండేదో కదా. నేటి ఆధ్యాత్మిక వాతావరణం, భక్తులలో వైషమ్యాలు, ఇంకనూ అనేక విధాల అధ్యాత్మిక సమాజ విలువలు ఎలా ఉన్నవో అంతర్గతంగాను, బాహ్యంగాను నేటి దినపత్రికల ద్వారా లోక విదితమే. ఇక ప్రస్తుత విషయానికి వస్తే-

శ్రుతిః సహోవాచ శ్రీరామః కైవల్యముక్తి రేకైన పాఠమార్తి క రూపిణీ
తా|| శ్రీరాముడు పలుకుచున్నాడు: పారమార్ధిక రూపమైన మోక్షము
అద్వయమే అయి యున్నదని ముక్తికోపనిషత్తు పారమార్ధిక 'ముక్తి
అద్వయమే అని స్పష్టంగ ప్రబోధించింది.
___________________________________________________
ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. 'మోక్షం' ఎన్ని విధాలని ఆంజనేయుడు అడుగుతూనే ముహర్షుల అభిప్రాయమగు 'నామస్మరణాదులచే కలిగెడి సాలోక్యాది
చతుర్విధ ముక్తులను, సాంఖ్య యోగముచేత కలిగెడి క్రమ ముక్తిని వేదాంత విచారణచేత లభించెడి ముక్తిని గురించి ప్రశ్నించడంలోనే తన సందేహం కూడ అదేనని చెప్పడం ద్వార త ఎంత విజ్ఞత ఉన్నదో గ్రహించాలి.
ఈవిధంగ సాధకులందరికి 'మోక్షం' గురించి ఉపనిషత్తుల ఉపదేశాన్ని స్పష్టంగ అవగాహన చేసుకొనిన యెడల, ఎవరు ఏవిధమైన ముక్తిని పొందాలని భావించి ధ్యానాదులు చేస్తారో, ఆ విధంగానే క్రమ ముక్తిని పొంద వచ్చునుకదా. శాశ్వతమైన పారమార్థిక కైవల్య ముక్తి మాత్రం అద్వయమైనదని జిజ్ఞాసులు ఎప్పుడూ మరువరాదు. వాస్తవ పరమార్థిక తత్త్వ (సత్య)మందు బంధమోక్షాదుల ప్రసక్తియే లేదని కూడ శ్రుతులు ఎన్నోవిధాలుగా స్పష్టంగా బోధించాయి.

శ్రుతి న నిరోధో న చోత్పత్తిర్న బద్దో న చ సాధకః, నముముక్షు
ర్శవై ముక్త ఇత్యేషా పరమార్ధతా|
తా|| నిరోధము లేదు. ఉత్పత్తి లేదు. బద్దుడు లేడు. సాధకుడు లేడు.ముముక్షువు లేడు. ముక్తుడు లేడు. ఇదయే పరమార్ధ తత్త్వము. అని

అమృతబిందూపనిషత్, అవధూతోపనిషత్, త్రిపురతాపిన్యుపనిషత్ మరియు ఆత్మోపనిషతులలో ఒకే మంత్ర సారమగు పరమార్థికత్త్వానికే ఎంతో ప్రాముఖ్యత నిచ్చి ప్రబోధించాయో ముముక్షువులు తెలసుకొని నిత్యానందానుభవం పొందడమే జన్మకు సార్థకం కదా.

శ్రుతి|| న జన్మమృత్యూ, న బంధమోక్షే, న సాధనసమాధీ
నధ్యాత్మధ్యేయౌ, నముముక్షుముక్తౌ ఇత్యేతదేవ పారమార్థికం తత్త్వమ్.
తా||| యదార్ధ(నగ్న) సత్యమునందు జీవన్మరణములు, బంధవిముక్తులు సాధన సమాధులు, ధ్యానము, ధ్యానించువాడు, ముక్తి, ముక్తి కోరువాడు ముక్తి పొందువాడు, అనునది ఉండదని శివజ్ఞానోపనిషత్తు మరింత విపులంగ బోధించింది కదా.
ఇంకా అనేక శ్రుతులలో ఈ విషయం విస్తారంగ ప్రబోధించాయి. ఈ కైవల్య ముక్తి .. నిత్యానందం సదా తన స్వస్వరూపమేననియు, అది వివేకంతో జ్ఞాన నిశ్చయంకలిగి
విచారణ వలన స్వానుభవవైక వేద్య మని శ్రుతులు ఘోషించాయి కనుక జ్ఞానం వలనే కైవల్యముక్తి సహజానుభవం కాగలదు
________________________________________


శ్రుతి| అతఏవ బ్రహ్మలోకస్థా అపి బ్రహ్మముఖా ద్వేదాంత శ్రవణాది
కృత్వా తేన సహ కైవల్యంలభస్తే, అతసర్వేషాం కైవల్య ముక్తిః జ్ఞాన
మార్గేణోక్తా న కర్మ సాంఖ్య యోగో పాసనాదిభి రిత్యునిషత్ I
తా|| క్రమముక్తి నొందువారు కూడా బ్రహ్మలోకమున వసించి బ్రహ్మముఖతః వెలువడే వేదాంత పీయూష ధారలను పానముచేసి ప్రళయకాలమున బ్రహ్మదేవునితో కలిసి ముక్తిని పొందుచున్నారు.
అందుచేత జ్ఞానమార్గమే ముక్తికి ఏకైక మార్గం. కర్మ ద్వారా గాని సాంఖ్యం వలన గాని, ఉపాసన వలన గాని ముక్తి లభ్యం కాదని ఉపనిషద్వచన మని ముక్తికోపనిషత్తు ఘంటా పధంగ స్పష్టం చేశింది కదా: దీనికి ఉపాయం కూడ శ్రుతి ఇలా ఉపదేశించింది

త్రుతి| మాండూక్యమేక మేవాలం ముముక్షూణాం విముక్తయే
తా|| హనుమా!ముముక్షులకు జీవన్ముక్తిలగుటకు మాండూక్యోప నిషత్తుఒక్కటియే చాలును శ్రుతి విదేహ ముక్తా విచ్చా చేదష్టోత్తర శతం పఠ॥
తా|| నీకు విదేహ ముక్తి యందు అభీష్టమున్నచో నూట యెనిమిది ఉపనిషత్తులను పరింపుమని ముక్తికోపనిషత్తు బోధ.


ఈ 108 ఉపనిషత్తులను శ్రవణాదులు చేయాలని సాధకులకు కర్తవ్యాన్ని కూడా స్నష్టంగ నిర్దేశించింది. ఇంతకీ మాండూక్యోపనిషత్తులో చెప్పిన ఉపాయం ఏమిటి? అను దినము ప్రతివారికి సహజంగ వచ్చెడి జాగ్రత స్వప్న,గాఢనిద్రలను గాఢంగ విచారించడమే. గురు, శాస్త్రాను సారంగ పరిశీలించి విచారణచేసే వారందరికి నిత్యానందమే.


శ్రుతి తం వా ఏత మాత్మానం జాగ్రత్య స్వప్న మసుషుప్తం స్వప్నే
జాగ్రత సుషుప్తం సుషుప్తే జాగ్రత మస్యప్నం తురీయే జాగ్రత మస్యప్న మసుషుప్త మవ్యభిచారిణం నిత్యానందం సదేకరసం హేవ
తా | ఆ ఈ ఆత్మను మేల్కొన్నప్పుడు స్వప్న సుషుప్తులు లేనవాని గాను, స్వప్నమున జాగ్రదావస్థ, సుషుప్తి లేనివాడు గాను, నిత్యానందము కలదిగాను, ఉండి ఏకముగా నున్నదని
నృసింహాత్తర తాపిన్యుపనిషత్తు నిస్సంశయంగ స్పష్టంచేసి, సాధక, జిజ్ఞాసకులందరికి సహజ నిత్యానందమే ఆత్మగా .. స్వస్వరూపంగ ఉపదేశించినది. అనుభవ ప్రమాణమగు జాగ్రత, స్వప్న, సుషుప్తు లను జ్ఞాన అవగాహనతో గాఢంగ సహజంగ విచారించడమే. ఈ ఉపాయం కూడ సులభం కాని వారికి సాలోక్యాది చతుర్విద ముక్తులను, సాంఖ్య యోగం చేత క్రమముక్తిని గాని, మహావాక్య చింతనాదులతో జీవన్ముక్తిని విదేహముక్తిని పొందవచ్చుననియే శ్రుతుల ఉపదేశం. అందరూ స్వస్వరూప సహజ నిత్యానందానుభవం పొందడమే శ్రుతుల ప్రయోజనం,  ఉపదేశం, సందేశం అభిప్రాయం కూడ. వాస్తవంగ మౌన, స్వస్వరూపానందమే వాస్తవ పారమార్థిక తత్త్వంబనియు ఉపనిషత్తుల అమృత ఉపదేశం, శిశువుకు 'తల్లిపాల' వలె సాధకులకు
ఉపనిషత్తులు పరమప్రమాణం. స్వధర్మాచరణ చేయడానికిగాని, తన సహజ స్వస్వరూప నిత్యానందం స్వానుభవంగ పొందడాని కైననూ నిష్కామ్యంగా ఏకాత్మభావనతో స్వీయ దైవారాధనలు చేయడాని కైననూ సాలోక్య, సామీప్య, సారూప్య సాయుజ్య ముక్తులను పొందాలని తపించేవారి కైననూ ఉపనిషత్తులేచాలును కదా. అట్టి ఉపనిత్తులను
ఆదరించడం, సేవించడమే మనందరి కర్తవ్యం కూడ, దీనివలన సాధకులకు "మోక్షం" అంటే స్పష్టమైన అవగాహన కలిగి, అవిధంగా ఆచరించిన వారికే తగిన "మోక్షం" లభిస్తుంది. ఇది మరువరాదని ఆశించుచూ ..
                                                                                                                                                                                                                                                                                             నిర్గుణ చైతన్య



                                                                                                                                       మోక్షానికి సూత్రాలు

మోక్షం' అనుసది ఆకాశమందుగాని, కైలాస, వైకుంఠాదుల యందుగాని, పాతాళమునందుగాని వేరెక్కడునూ ప్రత్యేకించిలేదు.సాక్షాత్ తన స్వస్వరూపానందానుభవమే నిజమైన మోక్షం నిజమోక్ష సాధకులెవరూ మహాత్ములను కుతర్కంతో విమర్శించరు. కాలాన్ని వృధా చేయరు.  నిర్మల దృష్టితో సాధనాదులు చేయడమే చాలా ముఖ్యం వాస్తవాన్ని తెలిపేవే ఉపనిషత్తులు. కనుక వాటి ముఖ్యఉపదేశాలను తెలుసుకొని, స్వధర్మాచరణ కలిగి 'మోక్షం' పొందడమే మన కర్తవ్యం కూడా ఉపనిషత్తుల వాస్తవ ప్రబోధం అదైతత్త్వమే. ఉన్నది పరిపూర్ణ మౌన, సచ్చిదానంద స్వాత్మ బ్రహ్మమే నత్యానందం స్వానుభవ స్వస్వరూపమే. కనుక కొత్తగ పొందడంలేదు అనుభవంగా ఉన్న దానినే స్వీయ జ్ఞానంతో 'జప్తి'గ ఊరక మౌనంగ స్వానందులుగ ఉండడమేనని ఉపనిషత్తుల అద్వితీయ, అమృత ప్రబోధం.
కర్మ, సాంఖ్య, ఉపాసనాదులవలన 'కలిగెడి క్రమ ముక్తులు' వాస్తవ పరమార్థ తత్త్వాన్ని పొందలేని వారికే సత్యం. ఇవన్నియూ జననమరణాదులను కలిగించునవే
మనోపరిపక్వతల ననుసరించి అందరికోసం అన్ని సాధనా పద్ధతులను ఉపనిషత్తులే బోధించాయి. ఉపనిషత్తులకు తగిన ప్రాముఖ్యత నివ్వక పోవడమే ముముక్తువులలో
పారమార్థిక 'ముక్తి' గురించి సరియగు అవగాహన లేదుసామాన్యుల దగ్గరనుంచి పండితుల వరకు సులభంగ అర్ధం తెలుసుకొనే విధంగా ఉపనిషత్తుల 'మంత్రాలు' విస్తారంగ ఉన్నాయని మరువరాదు 

                                                                                                                         
ఉపనిషత్తుల ప్రబోధం - సందేశం
 స్వధర్మ, సత్కర్మాచరణ కలిగి మానవత్వంతో, సమైక్యతాభావంతో తోటివారితో కలసి మెలసి  సహజీవనం చేయుచు విశ్వశాంతి  ​కై కృషి చేయుచూ ప్రతివారూ వంద
సంవత్సరాలు జీవించాలనియు, కడకు జనన మరణ రహిత నిత్యానందాన్ని పొందజేసెడు మార్గాలను  సూచించిన ఘన విజ్ఞాన రాశియైన ఉపనిషత్తులే మన భారతీయులకు
పరమ  ప్రమాణం. వీటిలోని తత్త్వాన్ని, సందేశాలను ఆచరించి శాశ్విత నిత్యానందాన్ని పొంది  భావితరాలకు అందించిన వారే స్వానుభవ మహర్షులు, తత్త్వవేత్తలు మొదలగువారు. దేవుడు  ఒక్కడేననియు, స్వాత్మే సత్యమనియు, అది సాక్షాత్తు పరిపూర్ణ మౌన సచ్చిదానంద వ్స్వరూపమని తెలిసి, అట్టి నిత్యానందాన్ని పొందడమే మానవ జన్మకు సార్ధకమనియు అట్టి స్వాత్మానందాన్ని అజ్ఞాన, అహంకార, వాసనాదులతో పొందలేని వారు ఏకాత్మభావం తో దైవారాధనలు చేసిన యెడల క్రమంగా శుద్ది, నిశ్చలతాదులతో బాటు క్రమంగా నిష్కామ్య భావన కలిగి, సద్గురు అనుగ్రహంతో గాని, సంస్కారము వలన గాని వాస్తవ జ్ఞానం కలిగి, తద్వారా స్వీయ విచారణ చేత తనను తాను నిత్యానంద-స్వస్వరూపంగా  స్వానుభవంగా ఊరక మౌనంగా ఉండడమే “ముక్తి" యని ఉపనిషత్తులే ఘోషించాయని  మనం మరువరాదు. ఈ తత్త్వమే బ్రహ్మ సూత్రాలు, భగవద్గీతాదుల యందు స్పష్టంగా ఉన్నప్పటికిని, కొందరి వ్యక్తిగత స్వార్ధచింతనాది బోధనలచేతను ఇంకనూ అనేక కారణాదుల చేతను ప్రస్తుతం ఆధ్యాత్మికాది వ్యవస్థలును, శాంతి నుఖాదులు కరువై ఏ విధంగా ఉన్నామో  లోకవిదితమే కదా!  ఇట్టి పరిస్థితి చూసి  నాలో  కలిగిన ఆవేదన చేతనే ఉపనిషత్తుల తత్త్వాన్ని, సందేశాన్ని ఉపనిషత్తుల ప్రమాణంతోనే మీ అందరికి ముఖ్యంగ జిజ్ఞాసులకు అవగాహన చేయాలని, తద్వారా స్వధర్మాచరణ ను, నిత్యానందాన్ని పొందగలరనే తపనతో ఈ గ్రంథముల ద్వారా ఉపనిషత్తుల సందేశాన్ని అందిస్తున్నాను.
                                                                                                                                                                                                                                                                                             నిర్ధుణ చైతన్య



Back to List of Books
please note that the above images in between the matter are not part of the books. They are added to enhance visual appearance  of the matter. 
Site powered by Weebly. Managed by HOSTINGRAJA.IN
  • Index
  • Gallery
  • About
  • Trust
  • Blog
  • Literature
  • స్వయం అవగాహన
  • Today
  • Contact